- కోలిండియా పోటీల్లో పాల్గొనే సింగరేణి జట్టును ప్రకటిస్తాం : స్పోర్ట్స్ ఆఫీసర్లు
కోల్‌బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్‌లోని సింగరేణి ఠాగూర్ స్టేడియం, మందమర్రి గ్రౌండ్లో నిర్వహించిన కంపెనీ లెవల్ క్రికెట్ పోటీల్లో శ్రీరాంపూర్ ఏరియా జట్టు విజేతగా నిలిచింది. మణుగూరు-ఇల్లందు కంబైన్డ్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. శుక్రవారం శ్రీరాంపూర్, మణుగూరు-ఇల్లందు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన మణుగూరు-ఇల్లందు జట్టు 86 పరుగులకు ఆలౌట్ అయింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీరాంపూర్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 87 పరుగులు చేసి విజయం సాధించింది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ పోటీల్లో ఆరు జిల్లాలకు చెందిన 12 ఏరియాల జట్లు పాల్గొని తమ ప్రతిభను చాటాయి. విజేతలకు మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ, ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి ఎం.డి.అక్బర్ అలీ, సింగరేణి ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్ బహుమతులు అందజేశారు. త్వరలో కోల్ ఇండియా పోటీల్లో పాల్గొనే సింగరేణి కంపెనీ జట్టును ప్రకటిస్తామని స్పోర్ట్స్ ఆఫీసర్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు సింగరేణి ఆఫీసర్లు, కార్మిక సంఘాల నాయకులు, స్పోర్ట్స్ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
